Bandi Sanjay: హుజూరాబాద్ లో బీజేపీ జోష్.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

KCR lost peoples faith says Bandi Sanjay
  • కేసీఆర్ ను ప్రజలు నమ్మడం లేదు
  • హుజూరాబాద్ లో గెలుస్తామని ముందే చెప్పాం
  • బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల లీడ్ ను సాధించారు. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచేది బీజేపీనే అని తాము ముందు నుంచే చెపుతున్నామన్నారు.

డబ్బు, అధికారంతో ఎన్నికను గెలవాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారని సంజయ్ అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచేలా ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారని... ఆయనను జనాలు నమ్మడం లేదని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని, ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని అన్నారని... వీటిలో ఏ ఒక్కటి చేయలేదని అందుకే కేసీఆర్ పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు.

ఈ ఎన్నికలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని... అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ చెప్పారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోందని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కేసీఆర్ ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని సూచించారు. కేసీఆర్ ఇప్పటికైనా అహంకారపూరిత నైజాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
Bandi Sanjay
Etela Rajender
BJP
Huzurabad

More Telugu News