Virat Kohli: విరాట్ కోహ్లీ పది నెలల కుమార్తె వామికకు అత్యాచారం బెదిరింపులు!

  • షమీకి అండగా నిలిచినందుకు కోహ్లీ కుమార్తెను రేప్ చేస్తామంటూ బెదిరింపులు
  • తీవ్రంగా ఖండించిన పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమాముల్ హక్
  • కోహ్లీ కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను విమర్శించొచ్చు కానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడమేంటని ప్రశ్న
  • తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన
  • కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సహించరానిదన్న పాక్ మాజీ పేసర్
  • ఇండియాలో ఇలాంటివి మామూలేనంటున్న నెటిజన్లు
Virat Kohli Daughter  Vamika Received Rape Threats

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మల గారాలపట్టి పది నెలల వామికకు అత్యాచారం బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా పరుగులు ఇచ్చుకోవడమే భారత జట్టు ఓటమికి కారణమని, టీమిండియాలోనూ ఓ పాకిస్థానీ ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా షమీపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ట్రోల్స్‌ను పలువురు మాజీ క్రికెటర్లు ఖండించారు.

తాజాగా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడిన కోహ్లీ.. షమీకి అండగా నిలిచాడు. షమీ దేశభక్తిని, అంకితభావాన్ని శంకించాల్సిన పనిలేదన్నాడు. అతడికి అండగా ఉంటామని స్పష్టం చేశాడు. సరిగ్గా కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలే వామికపై అత్యాచారం బెదిరింపులకు కారణమయ్యాయి. ముస్లిం సహచరుడికి అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగారు.  

 @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి కోహ్లీ కుమార్తె వామికకు బెదిరింపు ట్వీట్ వచ్చింది. వామికపై అత్యాచారం చేస్తామని ఆ యూజర్ హెచ్చరించాడు. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించాడు. ఈ ట్వీట్‌పై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆటను ఆటలా చూడకుండా మతంతో ముడిపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ ట్వీట్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్, మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ స్పందించారు. కోహ్లీ కుమార్తెకు వచ్చిన బెదిరింపుల విషయం తను దృష్టికీ వచ్చిందన్న ఇంజీ.. క్రికెట్ అనేది ఒక ఆటమాత్రమేనన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించాడు. తామందరం వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అందరం ఒకే కమ్యూనిటీకి చెందిన వారమన్నాడు.

 కోహ్లీని అభిమానించేవారు అతడి బ్యాటింగ్‌ను, కెప్టెన్సీని విమర్శించవచ్చని, కానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే హక్కు వారికి ఎక్కడిదని ప్రశ్నించాడు. షమీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్నాడు. గెలుపోటములనేవి ఆటలో చాలా సహజమైనవని పేర్కొన్నాడు. అంతామాత్రానికే కోహ్లీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మహ్మద్ ఆమిర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. భారత జట్టును, ఆటగాళ్లను ఆన్‌లైన్‌లో టార్గెట్ చేసుకోవడం చాలా నీచమైన పని అని అన్నాడు. ఇండియా ఇప్పటికీ, ఎప్పటికీ మంచి జట్టేనని అన్నాడు. క్రికెటర్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరోవైపు, సోషల్ మీడియాలో కోహ్లీకి మద్దతుగా పలువురు కామెంట్ చేస్తున్నారు. షమీకి కోహ్లీ అండగా నిలవడమే అతడు చేసిన తప్పని, ఇది ఇండియా కాబట్టి ఇలాంటివి ఇక్కడ మామూలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీకి అండగా నిలుద్దామని పిలుపునిస్తున్నారు. కాగా, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐదేళ్ల కుమార్తె జీవాను కూడా గతేడాది ఆన్‌లైన్‌లో టార్గెట్ చేసుకున్నారు.

More Telugu News