Kerala: ప్రముఖ మలయాళ సినీ నటుడు జోజు జార్జ్ కారును ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

Kerala Congress workers vandalise actor Joju Georges car
  • పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన
  • ఆరు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్
  • మహిళా కార్యకర్తలతో జోజు అసభ్యంగా ప్రవర్తించాడన్న కాంగ్రెస్
  • పరీక్షల్లో తాగలేదని తేలిన వైనం
  • ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసన ఉండకూడదన్న జోజు
కేరళకు చెందిన ప్రముఖ నటుడు జోజు జార్జ్ కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. కేరళలోని ఎర్నాకుళంలో జరిగిందీ ఘటన. పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న నిరసన చేపట్టి రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఎడపల్లి-వైటిల్లా జాతీయ రహదారిపై దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన నటుడు జోజు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రెండు గంటలపాటు వేచి చూసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో అసహనంగా కిందికి దిగి కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు.

నిరసన తెలపొచ్చు కానీ ఇలా అందరినీ ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన ముగించాలని కోరారు. ఈ నిరసన వల్ల ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారుపై దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు.
 
ఈ విషయంలో కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. జోజు పూర్తిగా తాగిన మత్తులో ఉన్నారని, మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాదు, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోజు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనను వైద్య పరీక్షలకు పంపారు. పరీక్షల్లో ఆయన మద్యం తాగలేదని తేలింది. కారుపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మీడియా ద్వారానే తమకు విషయం తెలిసిందన్నారు. కాగా, అనుమతి తీసుకోలేదన్న పోలీసుల వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ స్పందించారు. అరగంటపాటు నిరసన తెలిపి రోడ్డును దిగ్బంధం చేస్తామని పోలీసులకు నోటీసు కూడా ఇచ్చామని, మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వార్త వచ్చిందని పేర్కొన్నారు. జోజు తాగిన మత్తులో మహిళా కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.

మరోవైపు, ఘటనపై కేరళ పీసీసీ చీఫ్ కె.సుధాకరన్ కూడా స్పందించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జోజు తాను గొడవలు కోరుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని విజ్ఞప్తి చేశారు.
Kerala
Actor
Joju George
Car
Congress

More Telugu News