Trent Boult: చెప్పి మరీ టీమిండియాను దెబ్బతీసిన న్యూజిలాండ్ బౌలర్

Trent Boult scalps three wickets against Team India as he warned early
  • తొలి మ్యాచ్ లో భారత్ ను కకావికలం చేసిన షహీన్
  • తాను కూడా షహీన్ లా విజృంభిస్తానన్న ట్రెంట్ బౌల్ట్
  • నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన బౌల్ట్
  • పొదుపుగా బౌలింగ్ చేసి భారత్ పై ఒత్తిడి పెంచిన వైనం
టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు టైటిల్ ఫేవెరెట్ల జాబితాలో టీమిండియా కూడా ఉంది. నిన్నటితో ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి నుంచి తేరుకుని న్యూజిలాండ్ ను ఓడిస్తారని భావించిన టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. న్యూజిలాండ్ పైనా భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. వరుసగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలను కోహ్లీ సేన జటిలం చేసుకుంది.

కాగా, నిన్నటి మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన ఓ ప్రకటనను పరిశీలిస్తే... మనవాళ్ల బలహీనతలపై అతడెంత నమ్మకంతో ఉన్నాడో అర్థమవుతుంది. టీమిండియాపై పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది ఎలాంటి ప్రణాళిక అనుసరించాడో తాను కూడా అదే రీతిలో వ్యూహం పన్నుతానని బౌల్ట్ ముందే హెచ్చరించాడు. చెప్పడమే కాదు... చేసి చూపించాడు కూడా!

నిన్నటి మ్యాచ్ లో బౌల్ట్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. మొదట టీమిండియా చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ ను పెవిలియన్ కు పంపించిన బౌల్ట్... ఆపై హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లను కూడా బుట్టలో వేశాడు. ఆరంభంలోనే దెబ్బకొడితే టీమిండియా కోలుకోవడం కష్టమని మ్యాచ్ కు ముందు చెప్పిన బౌల్ట్... ధాటిగా ఆడే ఇషాన్ కిషన్ ను అవుట్ చేయడం ద్వారా తన సన్నద్ధతను ఘనంగా చాటుకున్నాడు.

అంతేకాదు, తొలి పవర్ ప్లేలో కేఎల్ రాహుల్, కోహ్లీ వంటి మేటి బ్యాట్స్ మన్లను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా వారిపై ఒత్తిడి పెంచడంలో బౌల్ట్ సఫలమయ్యాడు. కోహ్లీ క్యాచ్ ను పట్టింది కూడా బౌల్టే!

ఈ ఓటమితో టీమిండియా పరిస్థితి దయనీయంగా మారింది. గ్రూప్-2లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడిన భారత్... ఇంకా నమీబియా, ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ జట్లతో ఆడాల్సి ఉంది. అటు న్యూజిలాండ్ కూడా ఈ మూడు చిన్న జట్లపై ఆడాల్సి ఉంది. భారత్ సెమీస్ చేరాలంటే.... ఈ మూడు జట్లపై తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో... కివీస్ ఈ మూడు జట్లపై ఒకదాని చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పటికీ మెరుగైన రన్ రేట్ ఉంటేనే టీమిండియా సెమీస్ లో అడుగుపెడుతుంది.

రెండు వరుస పరాజయాలతో కోహ్లీ సేన నాకౌట్ అవకాశాలను ఎంతో సంక్లిష్టం చేసుకుందని పై సమీకరణాలు చెబుతున్నాయి. ఇక అదృష్టం కలిసొస్తే తప్ప టీమిండియా సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమే.
Trent Boult
Team India
Shaheen Afridi
New Zealand
T20 World Cup

More Telugu News