Sabyasachi Mukherjee: మంగళసూత్రాన్ని అపవిత్రం చేస్తూ యాడ్.. మధ్యప్రదేశ్ హోం మంత్రి హెచ్చరికలతో దిగొచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి.. ఆ యాడ్‌లో ఏముంది?

  • ఒంటరిగా, అసభ్యకర స్థితిలో ఉన్న మహిళల మెడలో మంగళసూత్రం
  • తీవ్రస్థాయిలో విమర్శలు
  • ఉపసంహరించుకునేందుకు 24 గంటల సమయం ఇచ్చిన మంత్రి
  • నొచ్చుకుంటూ యాడ్‌ను ఉపసంహరించిన సవ్యసాచి
  • గతంలో దాబర్ ఇండియా ప్రకటనపైనా విమర్శలు
Designer Sabyasachi withdraws mangalsutra ad

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరికలు బాగానే పనిచేశాయి. మంగళసూత్రం వాణిజ్య ప్రకటనను అసభ్యంగా చిత్రీకరించి విమర్శల పాలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. విమర్శలు వెల్లువెత్తిన ఈ ప్రకటనలో ఒంటరిగా ఉన్న మహిళలు కొందరు మంగళసూత్రంతో కనిపించగా, మరికొంతమంది అసభ్యంగా ఉన్న సమయంలో మంగళసూత్రం ధరించినట్టుగా ఉంది.

ఈ ప్రకటన చూసిన నెటిజన్లు మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ సవ్యసాచిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు, ఈ యాడ్‌పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లోగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, పోలీసు బలగాలను కూడా పంపిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు మంత్రి అల్టిమేటంతో దిగొచ్చిన సవ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. వారసత్వం, సంస్కృతిని కలగలిపి యాడ్‌ను చిత్రీకరించామని, కానీ ఈ ప్రకటన సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందన్న ఆరోపణలు తమను కూడా బాధించాయని, అందుకనే యాడ్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సవ్యసాచి కంపెనీ వెల్లడించింది.

అసలు నరోత్తమ్ ఏమన్నారు?
మంగళసూత్రాన్ని అపవిత్రం చేసేలా ఉన్న ఈ ప్రకటనపై మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇలాంటి యాడ్‌లపై గతంలోనూ హెచ్చరించామన్నారు. ప్రస్తుత మంగళసూత్ర ప్రకటనపై సవ్యసాచిని వ్యక్తిగతంగా హెచ్చరించినట్టు చెప్పారు. అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్న ఈ ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పోలీసు బలగాలను కూడా పంపిస్తానని హెచ్చరించారు.

మంగళసూత్రం అనేది అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఆభరణమని పేర్కొన్నారు. హిందువులకు సంబంధించిన వాటిపైనే ఇలాంటివి తరచూ ఎందుకు జరుగుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖర్జీకే కనుక దమ్ము, ధైర్యం ఉంటే ఇతర మతాలకు చెందిన వాటిపైనా ఇలాంటి ప్రకటనలు చేయాలని సవాలు విసిరారు. అప్పుడే అతడు నిజమైన ధైర్యవంతుడని తాము భావిస్తామన్నారు.

ప్రకటనలో ఏం చూపించారు?
సవ్యసాచి రూపొందించిన ఆ ప్రకటనలో కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళలు మంగళసూత్రం ధరించారు. మరో దాంట్లో ఓ వ్యక్తితో శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉన్న మహిళ మంగళసూత్రం ధరించింది. సవ్యసాచి ఈ ఫొటోలను షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రకటన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని దుమ్మెత్తి పోశారు.  

గతవారంలో ఇలాంటి ప్రకటనే ఒకటి విమర్శలకు కారణమైంది. డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఫెమ్ క్రీమ్ బ్లీచ్ ప్రకటనపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రకటనలో ఇద్దరు స్వలింగ సంపర్క జంట ’కర్వా చౌత్’ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఉంది. పవిత్రమైన కర్వాచౌత్ పండుగను ఇలా అపహాస్యం పాలు చేశారంటూ విమర్శలు రావడంతో డాబర్ ఇండియా ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది.

More Telugu News