Vishal: పునీత్ చదివించిన ఆ 1800 మంది చిన్నారుల బాధ్యత ఇకపై నాదే: సినీ నటుడు విశాల్

  • పునీత్ మరణం చిత్రపరిశ్రమకే కాదు.. సమాజానికే తీరని లోటు
  • ఒక్క మనిషి ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాడంటే నమ్మశక్యం కావడం లేదు
  • పునీత్ సేవా కార్యక్రమాలకు ఇకపై నా వంతు సాయం
  • ‘ఎనిమి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో విశాల్ వ్యాఖ్యలు
kollywood star actor vishal said puneeth demise is loss of all

పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, మేకప్, ఉన్నా లేకున్నా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎక్కడైనా ఆయన ఒకేలా మాట్లాడేవారని కోలీవుడ్ నటుడు విశాల్ అన్నారు. సమాజానికి పునీత్ ఎంతో చేశారని, ఎంతోమందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు.

ఒకే ఒక్క మనిషి ఇన్ని పనులు చేశాడంటే నమ్మలేకున్నానని, ఇప్పటి వరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని, ఈ విషయంలో పునీత్‌కు మాటిస్తున్నానని చెబుతూ విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎనిమి’  సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. పునీత్ లేరన్న విషయం నమ్మశక్యం కావడం లేదన్నారు. ఆయన మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు. మరో నటుడు ఆర్య మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరని లోటని, ఆయన మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కాగా, విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More Telugu News