Team India: టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచిన న్యూజిలాండ్... టీమిండియా మొదట బ్యాటింగ్

New Zealand won the toss and Team India will bat first
  • దుబాయ్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • భారత జట్టు నుంచి భువనేశ్వర్ కుమార్ కు ఉద్వాసన
  • సూర్యకుమార్ యాదవ్ కు విశ్రాంతి
  • జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్
టీ20 వరల్డ్ కప్ తొలిమ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా నేడు రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పోటీపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

టీమిండియా ఈ మ్యాచ్ ను తీవ్రంగా పరిగణిస్తోంది. వీపులో నొప్పితో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ కిషన్, ఫామ్ లో లేని భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కాగా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు ఈ మ్యాచ్ లోనూ అవకాశం ఇచ్చారు.

అటు, న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చేశారు. టిమ్ సీఫెర్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే జట్టులోకి వచ్చాడు. సూపర్-12 దశలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తో ఆడి ఓటమిపాలయ్యాయి.

నమీబియాపై భారీ విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్

అబుదాబిలో నమీబియాతో జరిగిన పోరులో ఆఫ్ఘనిస్థాన్ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు చేసి ఓటమిపాలైంది. నమీబియా బ్యాట్స్ మెన్ లో డేవిడ్ వీజ్ 26 పరుగులు చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో హమీద్ హసన్ 3, నవీన్ ఉల్ హక్ 3, గుల్బదిన్ నాయబ్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎగబాకింది. 3 మ్యాచ్ లలో 3 విజయాలతో ఈ గ్రూప్ లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది.
Team India
New Zealand
Toss
T20 World Cup

More Telugu News