Pawan Kalyan: గెలిచినవాళ్లు రావడంలేదు... ఓడిపోయిన మేం వచ్చి ఇక్కడ పోరాడుతున్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Vijag in support for Vizag Steel Plant Labour
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పవన్ మద్దతు
  • కూర్మన్నపాలెం సభకు విచ్చేసిన జనసేనాని
  • అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు
  • ఒక్క ఎంపీ కూడా నోరెత్తడంలేదని ఆగ్రహం

జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖపట్నం కూర్మన్నపాలెంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు.

"నాడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదు? ఆంధ్రాలోని పాతికమంది ఎంపీలు దీనిపై మాట్లాడలేదేం? ఎందుకంటే వారికి పదవులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం. వారికి ప్రజల కష్టాలు, కన్నీళ్లు ముఖ్యం కాదు... అందుకే వారి మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినవారిలో చాలామంది దేవాలయాల్లో ప్రసాదం తిని కడుపు నింపుకునేవాళ్లన్న సంగతి ఆ ఎంపీలకు తెలుసా?

నేను ప్రజలను మోసం చేయను. నేను ఇక్కడ ఓడిపోయాను. అయినాగానీ ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేదు. ఇక్కడి ప్రజాసమస్యపై పోరాడడం నా కర్తవ్యంగా భావిస్తాను. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందరం ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి రావాలి. ఇది అన్ని పార్టీలు కలిసివస్తేనే సాధ్యమవుతుంది. ఆంధ్రావాళ్లకు ఎప్పుడూ మన వర్గం, మన కులం అనే దరిద్రం ఉంటుంది. మనందరం ఒక్కటి అనే సదుద్దేశం ఉండదు. దీనివల్ల భావితరాలు నష్టపోతాయి.

కార్మికుల కష్టాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయి? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి తెలియజేయాలి. విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్నే బాధ్యురాలిని చేయాలి. అలా చేయకపోతే మనం ఎందుకు కొట్లాడుతున్నామో కేంద్రానికి తెలియదు.

మీ రాష్ట్రం ఎంపీలు ఏంకావాలో చెప్పకపోతే మేం చేయడానికి ఏముంటుందని జాతీయనేతలు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలు ఏమీ మాట్లాడరు... రాష్ట్రానికి ఏం కావాలో కూడా వారికి తెలియదు... మాకు నష్టం వస్తోందని కూడా వారు చెప్పరయ్యా... అంటూ ఆ జాతీయస్థాయి నేతలు చెబుతున్నారు.

వీళ్లకు డబ్బు, కాంట్రాక్టులే ముఖ్యమా? వీళ్లు ప్రజల్లో తిరిగే వాళ్లు కాదు. ఎన్నికలప్పుడు వచ్చి, రెండు వేలో, మూడు వేలో ఇచ్చి వెళ్లిపోతారు. మళ్లీ ఓట్ల సమయంలోనే వస్తారు. సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ రారు, ఎవరూ నిలబడరు. ఓడిపోయిన మనమే రావాలి, మనమే నిలబడాలి. జనసైనికులు నిలడతారు, వీర మహిళలు నిలబడతారు... ప్రజల కోసం మేం నిలబడతాం!" అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

"దేశంలో ప్రతి పరిశ్రమకు గనులు ఉన్నాయి. ఉదాహరణకు టాటా ఉక్కు పరిశ్రమ ఉంది. టాటా స్టీల్ కు జార్ఖండ్ లోనూ, ఒడిశాలోనూ సొంత గనులు ఉన్నాయి. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటకల్లో సొంత గనులు ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంత ఎక్కువగా గనులు ఉన్నాయంటే... 70 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది. దాన్నేం చేయాలో తెలియక ఉన్నదంతా అమ్మేయండని చెబుతుంటుంది. ఇక్కడ ఏపీలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. మనకు ఆ గనులను ఇవ్వాలని, మా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని కేంద్రాన్ని ఒక్క ఎంపీ అయినా నోరెత్తి ఎందుకు అడగరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News