Pawan Kalyan: ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ వాళ్లు పట్టుకుపోయారు: విశాఖ సభలో పవన్ కల్యాణ్

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ఉద్యమించిన కార్మికులు
  • సంఘీభావంగా విశాఖ వచ్చిన జనసేనాని
  • కూర్మన్నపాలెంలో భారీ బహిరంగ సభ
Pawan Kalyan powerful speech at Vizag

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గొంతెత్తిన జనసేనాని పవన్ కల్యాణ్ నేడు కూర్మన్నపాలెంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైందని అన్నారు. నాడు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం అందరిలోనూ భావోద్వేగం నింపిందని పేర్కొన్నారు. 32 మంది ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు వచ్చిందని వెల్లడించారు.

దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారిలో తానూ ఒకడ్నని వివరించారు. అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారన్న వార్త వినగానే ఎంతో బాధ కలిగిందని చెప్పారు. వెంటనే జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించామని పవన్ వెల్లడించారు.

ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరించే ఇతర పరిశ్రమల తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చూడొద్దని ఆయనకు నివేదించామని తెలిపారు. ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, 18 వేల మంది రైతులు భూములు వదులుకుంటే స్టీల్ ప్లాంట్ వచ్చిందని అమిత్ షాకు వివరించామని పేర్కొన్నారు.

"మేం చెప్పిన అంశాలను అమిత్ షా సావధానంతో విన్నారు. అయితే నా పరిస్థితిని మీరు గమనించాలి. నాకు ఒక్క ఎంపీ కూడా లేడు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు. మరి నాకు ఆనాడు అమిత్ షా ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని కాదు... మీరు (ప్రజలు) ఉన్నారనే నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రజాబలం ఉంది కాబట్టే నాకు విలువ లభిస్తోంది. లేకపోతే ఒక్క క్షణంలో గడ్డిపోచలా తీసేసి పక్కనబెట్టేస్తారు.

నాకు ఎలాంటి స్వార్థం లేదు. భావితరాలు బాగుండాలన్నదే నా ఆశయం. నిన్నటి తరాలు ఎంతో కష్టపడి ఇవాళ మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే, అది అన్యాక్రాంతం అవుతుంటే అందరిలాగే బాధ కలుగుతుంది. ఏ పరిశ్రమకు నష్టాలు రావో చెప్పండి? ఏ వ్యాపారానికి నష్టాలు రావో చెప్పండి? ఏ పరిశ్రమకు అప్పులు లేవో చెప్పండి? ఒకవేళ నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే అది ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమే" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News