Farmers: రాజధాని రైతుల మహా పాదయాత్రకు పోలీసులు నిర్దేశించిన విధివిధానాలు ఇవే!

  • ఉద్యమాన్ని ప్రజలకు వివరించాలని రైతుల యోచన
  • న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర
  • తుళ్లూరు నుంచి తిరుమల వరకు యాత్ర
  • అనుమతి మంజూరు చేసిన పోలీసులు
AP Police gives nod to Amaravati farmers Maha Padayatra

అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టడం తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు నిన్న పోలీసుల నుంచి అనుమతి లభించింది. ఈ సందర్భంగా యాత్రకు కొన్ని షరతులు కూడా విధించారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యన యాత్ర కొనసాగించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. పాదయాత్రలో పాల్గొనేవారు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని తెలిపారు.

పాదయాత్ర సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని, డీజే గ్రూపులు పాల్గొనడం నిషేధిస్తున్నామని వివరించారు. ఒకట్రెండు పోర్టబుల్ హ్యాండ్ మైకులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, పాదయాత్ర నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసు అధికారులకు కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులు రక్షణ కల్పించాలని. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు నిర్దేశించారు.

పాదయాత్ర పొడవునా వీడియో తీయించాలని సూచించారు. శాంతిభద్రతల నిర్వహణకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు స్థానిక పరిస్థితులను బట్టి తగు నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ వివరించారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగనుంది.

More Telugu News