Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా

EC Releases Schedule For MLA Quota MLC Elections In Telugu States
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • ఏపీలో 3.. తెలంగాణలో ఆరు స్థానాలకు పోలింగ్
  • షెడ్యూల్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • నవంబర్ 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు ఉప ఎన్నికలు నిన్న ముగిశాయో లేదో.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం తయారైపోయింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనుంది.

ఏపీలో చిన్న గోవింద రెడ్డి దేవసాని, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీ కాలం ఈ ఏడాది మే 31తో పూర్తయింది. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల స్థానాలు జూన్ 3న ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాలకు అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

ప్రస్తుతం కరోనా కంట్రోల్ లోకి రావడంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలు సూచనలను చేసింది. కరోనా జాగ్రత్తలను తీసుకుంటూ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చింది.  

ఇవీ ముఖ్యమైన తేదీలు...

నవంబర్ 9 (మంగళవారం): ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 16 (మంగళవారం): నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
నవంబర్ 17 (బుధవారం): నామినేషన్ల పరిశీలన
నవంబర్ 22 (సోమవారం): నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవంబర్ 29 (సోమవారం): పోలింగ్ తేదీ, సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్.
నవంబర్ 29: సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
Andhra Pradesh
Telangana
MLC Elections
Election Commission
Assembly

More Telugu News