Jagga Reddy: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అప్పట్లో నేను చెపితే తప్పుపట్టారు: జగ్గారెడ్డి

  • ఇప్పుడు అందరూ అదే విషయం మాట్లాడుతున్నారు
  • ఇది టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలు ఆడుతున్న డ్రామా
  • రెండు రాష్ట్రాలు కలవకూడదనేది రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం
Jaggareddy comments on merging of two Telugu states

ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా టీఆర్ఎస్ రావాలని ఏపీ ప్రజల నుంచి విన్నపాలు వస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గతంలో తాను అంటే అందరూ తప్పుపట్టారని అన్నారు. ఇప్పుడు అందరూ అదే విషయం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలు ఆడుతున్న డ్రామా ఇది అని అన్నారు. ఏపీ, తెలంగాణ కలవకూడదనేది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను సమైక్య వాదాన్ని వినిపించానని.. అప్పుడు తనను తెలంగాణ ద్రోహి అన్నారని... అయినా తాను ఎమ్మెల్యేగా గెలిచానని జగ్గారెడ్డి చెప్పారు. సమైక్యం అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీతో దానికి సంబంధం లేదని అన్నారు. ఏపీ, తెలంగాణ నాయకులు ఇప్పుడు సమైక్యాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని... ప్రజల ఆలోచన మేరకే ముందుకు వెళ్తానని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే జీవితం బాగుంటుందని అందరూ కొట్లాడారని... అయితే సొంత రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. గతంలో తాను చెప్పిన విధంగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో కోటి మందికి పైగా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఉన్నారని అన్నారు.

More Telugu News