Kamala hassan: 'ఇండియన్ 2' వివాదానికి శుభం కార్డు.. శంకర్, నిర్మాతల మధ్య ఒప్పందం!

Indian 2 issue solved
  • కమలహాసన్, శంకర్ ల కలయికలో 'ఇండియన్ 2'
  • దర్శకుడు, మేకర్స్ మధ్య భేదాభిప్రాయాలు
  • అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్
  • కమల్ మధ్యవర్తిత్వంతో తాజాగా పరిష్కారం 
  • చరణ్ సినిమా తర్వాత ఇండియన్ 2 షూటింగ్   
గతంలో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. కమలహాసన్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అవినీతికి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడు పోరాడిన వైనాన్ని వెరైటీగా చూపించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్లో 'ఇండియన్ 2' చిత్రాన్ని కొన్నాళ్ల క్రితం ప్రారంభించారు.
 
అయితే, కొంత షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగి కొందరు టెక్నీషియన్లు మరణించడం.. అనంతరం కోవిడ్ వ్యాప్తి ఊపందుకోవడం.. ఆ తర్వాత దర్శకుడు, మేకర్స్ మధ్య బడ్జెట్టు విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. విషయం కాస్తా కోర్టుకి వెళ్లడం.. అక్కడ దర్శకుడికి అనుకూలంగా తీర్పు రావడం.. ఇలా పలు కారణాల వల్ల మళ్లీ షూటింగ్ మొదలవలేదు. ఈలోగా శంకర్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా మొదలెట్టేశారు కూడా.

ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు, మేకర్స్ అయిన లైకా ప్రొడక్షన్స్ మధ్య వివాదం సమసినట్టు.. ఇరువురూ కలసి ఓ ఒప్పందానికి వచ్చినట్టూ తెలుస్తోంది. సామరస్యపూర్వకంగా ఈ వివాదం ముగియడంలో హీరో కమలహాసన్ మధ్యవర్తిత్వం నెరపినట్టు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం చరణ్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యాక, శంకర్ ఈ 'ఇండియన్ 2' చిత్రం షూటింగును పూర్తిచేస్తాడట. ఆ తర్వాత తాను హిందీలో చేయాలనుకుంటున్న 'అపరిచితుడు' రీమేక్ ను ఆయన ప్రారంభిస్తాడని అంటున్నారు. మొత్తానికి సమస్యకు శుభం కార్డు పడడంతో.. త్వరలోనే 'ఇండియన్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుందన్నమాట!      
Kamala hassan
Shankar
Indian 2
Ramcharan

More Telugu News