'మంగళవారం మరదలు' వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ

29-10-2021 Fri 22:10
  • ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష
  • మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
  • మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
  • తాను ఎవరి పేరును ఉపయోగించలేదని మంత్రి వివరణ
Niranjan Reddy clarifies on his comments
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట రాజకీయ పక్షం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతుండడం తెలిసిందే. మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం మరదలు బయలుదేరింది అంటూ వ్యాఖ్యానించగా, తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల పట్ల నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని వెల్లడించారు.

అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు.