By Polls: తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు... ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం

By Polls in Huzurabad and Badvel
  • రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
  • ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
  • భారీ బందోబస్తు ఏర్పాటు
  • సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు
  • అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు (శనివారం) ఉప ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 1,715 మంది సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 3,880 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, పోలింగ్ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఫేక్ న్యూస్ నమ్మొద్దని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ కర్ణన్ వివరించారు.

ఇక, ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 221 కేంద్రాలను సమస్యాత్మకం అని భావించిన ఎన్నికల సంఘం... ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క సూక్ష్మ పరిశీలకుడిని నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ సర్వర్ తో అనుసంధానించారు.

  • Loading...

More Telugu News