టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర సమరం... ఆస్ట్రేలియాతో శ్రీలంక ఢీ

28-10-2021 Thu 19:30
  • కొనసాగుతున్న సూపర్-12 దశ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • దుబాయ్ లో మ్యాచ్
  • ఇరుజట్లలోనూ గమనించదగ్గ ఆటగాళ్లు
Australia and Sri Lanka face off in Dubai
యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశ కొనసాగుతోంది. నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. దుబాయ్ లో జరిగే ఈ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లు ఫించ్, వార్నర్ ఇంకా ఫామ్ అందుకోకపోవడం ఆసీస్ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మ్యాక్స్ వెల్, స్మిత్ సూపర్ ఫామ్ లో ఉండగా, ఆల్ రౌండర్ స్టొయినిస్ ఎంతో ఉపయుక్తమైన పరుగులతో జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. బౌలింగ్ లో ఆసీస్ అత్యంత బలోపేతంగా ఉంది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజెల్ వుడ్, జంపా ఎలాంటి బ్యాటింగ్ లైనప్ కైనా పరీక్ష పెట్టగల సమర్థులు.

శ్రీలంక జట్టును చూస్తే బినుర ఫెర్నాండోను తప్పించి మహీశ్ తీక్షణను తుది జట్టులోకి తీసుకున్నారు. లంక జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. బ్యాటింగ్ ఓ నిస్సాంక, అసలంక నిలకడగా ఆడుతుండగా, మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తుండడం లంక జట్టులో కొత్త ఆశలు రేకెత్తిస్తోది.