VV Lakshminarayana: అమరావతి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్య: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

  • తుళ్లూరు వెళ్లిన లక్ష్మీనారాయణ
  • రైతులకు, మహిళలకు సంఘీభావం
  • పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన
  • మహిళలు లాఠీ దెబ్బలు తినడం కలచివేసిందని వెల్లడి
CBI Former JD Lakshmi Narayana extends his support for Amaravati farmers

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన ఇవాళ తుళ్లూరులోని రైతుల ఉద్యమ శిబిరానికి వచ్చారు. రైతుల మహాపాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని స్పష్టం చేశారు. అమరావతి అంశం రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని అన్నారు. అమరావతి వెనుక ఇతర ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

"అమరావతి నిర్మాణం కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకువచ్చారు. 29 గ్రామాలకు చెందిన 29 వేల మంది వరకు రైతులు దాదాపు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ప్రపంచబ్యాంకు వెళ్లిపోవడం, ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిష్క్రమించడం చూశాం. ఇలాంటి పరిస్థితుల నడుమ అసలు ఇక్కడ రాజధాని ఉంటుందా? అనే ఒక సందిగ్ధత ఏర్పడింది. కొత్త ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ వేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. 2019 నవంబరులో మళ్లీ రాజధాని పనులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక్కడి రైతుల్లో పూర్తిగా అయోమయం నెలకొంది.

రైతులు, మహిళలు 681 రోజులుగా రోడ్లపై కూర్చుని తమ ఆవేదన వ్యక్తం చేస్తుండడం బాధాకరం. ఉద్యమం సందర్భంగా మాతృమూర్తులు లాఠీదెబ్బలు తినడం మనసును కలచివేసింది. రాజధాని అమరావతిలోనే ఎందుకు ఉండాలనేది రైతులు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆకారం దృష్ట్యా అమరావతిలో అయితే సరిగ్గా మధ్యలో ఉంటుందని భావించారు. కావాలనుకుంటే హైకోర్టు బెంచ్ లు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు శీతాకాలంలో అనుకూల ప్రాంతాల్లో జరుపుకోవచ్చు.

నేను ఇవాళ రైతుల శిబిరానికి వచ్చేముందు అమరావతిలో పర్యటించాను. అసెంబ్లీ భవనం, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. ఎన్జీవోల కోసం నిర్మించిన 16 వేల ఇళ్లు దాదాపు 50 శాతం పూర్తయ్యాయి. ఆలిండియా సర్వీసుల అధికారుల కోసం ఇళ్లు 90 శాతం పూర్తయ్యాయి. జడ్జిల కోసం, సీనియర్ అధికారుల కోసం, మంత్రుల కోసం బంగ్లాలు నిర్మాణం జరుపుకుంటూ మధ్యలో ఆగిపోయాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల మేర పనులు పూర్తయినట్టు, ఇంకా రూ.43 వేల కోట్ల మేర పనులు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలో తెలియని అనిశ్చితి రైతుల్లో నెలకొని ఉంది.

ఇన్ని రోజులు శిబిరంలో కూర్చుని దీక్ష చేశారు. ఇకపై నవంబరు 1 నుంచి ప్రజల్లోకి రావాలని రైతులు నిర్ణయించుకున్నారు. తాము భూములు ఇచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ప్రజలకు తెలియజేయడమే వారి మహాపాదయాత్ర ముఖ్య ఉద్దేశం.

ఎక్కడైనా ఇలాంటివి జరిగినప్పుడు నష్టపోయేది రైతులే. ఉదాహరణకు విశాఖలో చూస్తే...  20 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారిలో ఇంకా 8,500 మంది రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు. ఇప్పుడా రైతు కుటుంబాల పరిస్థితి ఏంటి? రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంటుంది.

మరి ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు ఎలా బతకాలి? ప్రభుత్వం వారికి ప్యాకేజి ఇచ్చినప్పుడే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వర్తింపజేసినట్టు అవుతుంది. అమరావతి రైతుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు. అందుకే వారు తిరుమల వరకు మహాపాదయాత్ర చేస్తున్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకే ఉద్యమ శిబిరానికి వచ్చాను" అంటూ లక్ష్మీనారాయణ వివరించారు.

More Telugu News