షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు పెద్ద ఊరట.. బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్

28-10-2021 Thu 17:03
  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్
  • అక్టోబర్ 3 నుంచి కస్టడీలో ఉన్న ఆర్యన్
  • ఆర్యన్ బెయిల్ పిటిషన్లను వరుసగా తిరస్కరించిన కింది కోర్టు
Bombay High Court grants bail to Aryan Khan in drugs case
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాల తర్వాత ఆయనకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం లభించింది. అక్టోబర్ 3 నుంచి ఆయన కస్టడీలో ఉన్నాడు. 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో వున్నాడు.

జైల్లో ఉన్న ఆర్యన్ ను ఒకసారి ఆయన తల్లి గౌరీ ఖాన్, మరోసారి తండ్రి షారుఖ్ కలిశారు. ఈ రెండు సందర్భాల్లో ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడనే సమాచారం బయటకు వచ్చింది. జైల్లో తాను ఉండలేకపోతున్నానని, ఇక్కడి తిండి తినలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నాడు. తన కుమారుడికి బెయిల్ తెప్పించుకునేందుకు షారుఖ్ విశ్వప్రయత్నం చేశారు. కింది కోర్టు వరుసగా బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తుండటంతో... వీరు హైకోర్టును ఆశ్రయించారు.

బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆర్యన్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఎన్సీబీ తరపు లాయర్లు వాదించారు. అయినప్పటికీ ఆర్యన్ కు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన వెంటనే ఆర్యన్ జైలు నుంచి విడుదల అవుతాడు.