‘కనిపించకుండా’ కోట్లు కొల్లగొట్టేస్తున్న బ్యాంకులు.. ఒక్క ఏడాదిలోనే కస్టమర్ల నుంచి రూ.9,700 కోట్లు వసూలు!

28-10-2021 Thu 14:39
  • విదేశాలకు పంపించే డబ్బుపై ఎక్స్ చేంజ్ మార్కప్ చార్జీలు
  • హిడెన్ చార్జీలుగా వసూలు
  • అమాంతం పెంచేసిన బ్యాంకులు
  • ఎక్కువగా గల్ఫ్ కార్మికులపైనే భారం
  • ప్రాసెసింగ్ ఫీజు తగ్గించామని చెబుతూనే ‘మార్కప్’లో వడ్డన
  • ‘క్యాపిటల్ ఎకనామిక్స్’ అనే సంస్థ నివేదిక
Banks Charging Hidden Fees On Foreign Transfers
బ్యాంకులు మనకు తెలియకుండానే వేలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టేస్తున్నాయి. హిడెన్ చార్జీల పేరిట సొమ్ము చేసుకుంటున్నాయి. వాటికి లెక్కాపత్రం చూపకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. మనకు కనిపించని ఏంటా హిడెన్ చార్జీలు?.. ఓ లుక్కేయండి.

ఉన్నత చదువులనో.. మంచి వైద్యం కోసమో.. విదేశాల్లో ఉన్న పిల్లలను చూసొద్దామనో.. విదేశీ అందాలను ఆస్వాదించడానికనో చాలా మంది విదేశాలకు విమానమెక్కేస్తుంటారు. మరి, ఆయా దేశాల్లో మన కరెన్సీ నడవదు కదా. దానిని ఆయా దేశాల కరెన్సీల్లోకి మార్చుకోవాలి. ఇలా డబ్బును ట్రాన్స్ ఫర్ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, ఎక్స్ చేంజ్ మార్కప్ పేరుతో బ్యాంకులు హిడెన్ చార్జీలను వేస్తున్నాయంటూ ‘క్యాపిటల్ ఎకనామిక్స్’ అనే ఓ స్వతంత్ర సంస్థ బ్యాంకుల చర్యను బయటపెట్టింది.

విదేశాల్లో ఉన్న తమవారికి 2021లో భారతీయులు దాదాపు రూ.95 వేల కోట్లు (1270 కోట్ల డాలర్లు) ట్రాన్స్ ఫర్ చేశారు. అందులో ఎక్కువగా 380 కోట్ల డాలర్లను ఉన్నత విద్య కోసం పంపించారు. పర్యటనల కోసం 320 కోట్ల డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ కోసం మరో 270 కోట్ల డాలర్లను పంపించారు. ఇలా విదేశాలకు పంపే డబ్బుపై చార్జీలను తగ్గించామని కొన్నేళ్ల కిందటే బ్యాంకులు ప్రకటించాయి. కేవలం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. దీంతో వాటి ఆదాయం పడిపోయింది.

2016లో ప్రాసెసింగ్ ఫీజు కింద బ్యాంకులు రూ.15,017 కోట్లు ఆర్జిస్తే.. 2019లో అది రూ.12,142 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ లోటును పూడ్చుకునేందుకు ఎక్స్ చేంజ్ మార్కప్ పేరుతో చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఆ చార్జీలను బ్యాంకులు భారీగా పెంచేశాయి. వాటి ద్వారా 2016లో కేవలం రూ.2,505 కోట్ల ఆదాయమే రాగా.. 2019లో అది రూ.4,422 కోట్లకు పెరిగింది.

ప్రాసెసింగ్ చార్జీలను తగ్గించామని చెబుతున్న బ్యాంకులు.. కస్టమర్లకు తెలియకుండానే ఈ ఎక్స్ చేంజ్ మార్కప్ చార్జీలను అమాంతం పెంచేశాయి. ప్రాసెసింగ్ ఫీజులో వచ్చిన లోటును ఎక్స్ చేంజ్ మార్కప్ చార్జీలతో పూడ్చుకుంటున్నాయి. ఈ లెక్కల ప్రకారం ఒక్క 2020లోనే ఈ ఎక్స్ చేంజ్ మార్కప్ చార్జీలతో బ్యాంకులు రూ.9,700 కోట్లను తమ గల్లా పెట్టెల్లో వేసుకున్నాయని క్యాపిటల్ ఎకనామిక్స్ పేర్కొంది. విదేశాలకు పంపిన డబ్బులో ప్రాసెసింగ్ ఫీజు ద్వారా రూ.26,300 కోట్లు సంపాదించాయి. దానితో పోలిస్తే ఎక్స్ చేంజ్ మార్కప్ ఆదాయం 36 శాతం.

మామూలుగా డాలర్ రేటు స్థిరంగా ఉండదన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు దాని విలువ మారుతుంటుంది. దానికి అనుగుణంగా మధ్యవర్తిత్వ సంస్థలు లావాదేవీలను జరిపేందుకు వీలుగా ఈ ఫీజును వసూలు చేస్తుంటాయి. వాటిని నేరుగా కాకుండా కేవలం హిడెన్ చార్జీల రూపంలోనే వసూలు చేస్తుంటాయి.

బ్యాంకుల ఈ కనిపించని చార్జీల దోపిడీతో ఎక్కువగా నష్టపోతున్నది గల్ఫ్ దేశాల్లోని శ్రమ జీవులే. వారి దగ్గరి నుంచి భారీగా ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. 2016లో వారి దగ్గర్నుంచి వసూలు చేసిన ప్రాసెసింగ్ ఫీజు రూ.10,200 కోట్లు కాగా.. 2020 నాటికి అది రూ.14 వేల కోట్లకు పెరిగింది. అదే రెమిటెన్స్ కోటా కింద హిడెన్ చార్జీల రూపంలో వసూలు చేసిన చార్జీలు రూ.4,200 కోట్ల నుంచి రూ.7,900 కోట్లకు పెరిగాయి.