సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న మ‌హిళా రైతులు.. తిరిగి వెళ్తుండ‌గా ట్ర‌క్కు ఢీ కొని ముగ్గురి మృతి

28-10-2021 Thu 13:44
  • హ‌ర్యానాలో ఘ‌ట‌న
  • మ‌రో న‌లుగురు రైతులకు గాయాలు
  • పారిపోయిన ట్ర‌క్కు డ్రైవ‌ర్
3 women farmers die after truck runs over them
సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న మ‌హిళా రైతులు తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా ఓ ట్ర‌క్కు ఢీ కొట్టడంతో, వారిలో ముగ్గురు మృతి చెంద‌డం కల‌కలం రేపింది. హ‌ర్యానాలోని ఝజ్జర్ రోడ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగుచ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టిక్రీలో రైతులు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అందులో పాల్గొన్న మ‌హిళా రైతులు ఈ రోజు ఉద‌యం ఇంటికి వెళ్ల‌డానికి ఝ‌జ్జ‌ర్ రోడ్‌లోని ఓ డివైడ‌ర్ మీద కూర్చొని ఆటో రిక్షా కోసం ఎదురుచూస్తున్నారు.

అదే స‌మ‌యంలో ప్ర‌మాద‌వశాత్తూ ఓ ట్ర‌క్కు వ‌చ్చి వారిని ఢీ కొట్టింది. దాంతో ఇద్ద‌రు మ‌హిళా రైతులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మ‌రో న‌లుగురు రైతులకు గాయ‌ల‌య్యాయి. వారిలో ముగ్గురు మ‌హిళ‌లే ఉన్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత ట్ర‌క్కు డ్రైవ‌ర్ పారిపోయాడు.