అదీ.. ధోనీ అంటే.. కెప్టెన్ కూల్ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్రశంసల వర్షం

28-10-2021 Thu 12:36
  • పొగడ్తలతో ముంచెత్తిన మార్కస్ స్టోయినిస్
  • ప్రత్యర్థులను రెండు రకాలుగా విభజిస్తాడు
  • ధోనీ నిర్ణయం నాకు రెండు రకాలుగా అనిపించింది
  • అవమానంగానూ.. కాంప్లిమెంట్ గానూ ఫీలయ్యా
Australia All Rounder Marcus Stoinis Commends Dhoni
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. అప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలను రచించి అమలు చేస్తాడని, అదీ..ధోనీ అంటే అంటూ పొగడ్తలు గుప్పించాడు. ఐపీఎల్ సందర్భంగా తనను కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడో ధోనీ చెప్పాడని తెలిపాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ విశేషాలను పంచుకున్నాడు.

తాను బ్యాటింగ్ కు దిగినప్పుడు ఎలా బౌలింగ్ చేసేది, ఫీల్డింగ్ ను ఎలా సెట్ చేసేది ధోనీ తనకు చెప్పాడని పేర్కొన్నాడు. ఒక రకంగా అవమానంగానూ.. ఓ రకంగా కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగానూ అనిపించిందని తెలిపాడు. అయినాగానీ తాను దానిని పాజిటివ్ గానే తీసుకున్నానని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ధోనీ రెండు రకాలుగా చూస్తాడని తెలిపాడు.


చివరి వరకు క్రీజులో ఉండి గెలిపించే ఆటగాళ్లను ఒకలా.. రాగానే రిస్క్ తీసుకుని భారీ షాట్లు ఆడే ఆటగాళ్లను మరోలా చూస్తాడన్నాడు. తనను చివరి వరకు క్రీజులో ఉండి గెలిచే ఆటగాడిగా ధోనీ చూస్తాడన్నాడు. దానికి తగ్గట్టుగానే ఫీల్డింగ్, బౌలింగ్ ను సెట్ చేస్తానని ధోనీ చెప్పినట్టు తెలిపాడు.