సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం

28-10-2021 Thu 07:02
  • పలు కీలక నిర్ణయాలపై చర్చ
  • పలు చట్ట సవరణలకు ఆమోదం తెలిపే అవకాశం
  • సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై నిర్ణయం
  • వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలపైనా చర్చ
AP Cabinet will meet today
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఈ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయానికి వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేస్తుండడం తెలిసిందే. అటు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం కూడా చట్ట సవరణ చేయనున్నారు. దీనిపైనా నేటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కూడా ఈ భేటీలో ఆమోద ముద్ర పడనుంది. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశం చట్ట సవరణ, దేవాదాయశాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై చర్చించనున్నారు. వచ్చే నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.