'ఆర్ఆర్ఆర్' ప్రచారపర్వం.. దుబాయ్ లో ప్రీ రిలీజ్ వేడుక?

27-10-2021 Wed 16:20
  • 'బాహుబలి' తర్వాత రాజమౌళి ప్రాజక్ట్
  • ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్'
  • జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
  • త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు
  • భారీ స్థాయిలో దుబాయ్ లో వేడుక     
RRR film pre release event to be organized in Dubai
'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి లానే భారీ బడ్జెట్టుతో.. భారీ తారాగణంతో ఇది నిర్మాణం జరుపుకుంటోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అసలు సిసలు మల్టీ స్టారర్ మజాను ఇవ్వనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

కొవిడ్ మూలంగా షూటింగులు వాయిదా పడడం వల్ల చిత్ర నిర్మాణంలో ఆలస్యం జరగడం.. దాంతో విడుదల తేదీలు కూడా మారడం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఇది భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. త్వరలోనే ప్రచార పర్వాన్ని వెరైటీగా.. డిఫరెంట్ స్టయిల్లో చేబట్టనున్నారు.

ఇందులో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంటును దుబాయ్ లో ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త ఇప్పుడు ప్రచారంలో వుంది. భారీ స్థాయిలో.. అతిరథ మహారథుల మధ్య.. ఈ ఈవెంటును అక్కడ నిర్వహిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదే వాస్తవమైతే కనుక, అంతర్జాతీయంగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్ కి ఇది మంచి ప్లాట్ ఫారమ్ అవుతుందనే చెప్పాలి!