బీజేపీలో చేరనున్న స్టయిలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్?

27-10-2021 Wed 16:03
  • ఇప్పటికే లక్ష్మణ్ తో చర్చలు జరిపిన బీజేపీ జాతీయ నేతలు
  • అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న లక్ష్మణ్
  • జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి బరిలోకి  దిగే అవకాశం
VVS Lakshman to join BJP
భారత మాజీ క్రికెటర్, స్టయిలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలో ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు చెపుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.
 
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ... క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందని చెపుతున్నారు.
 
2012లో అంతర్జాతీయ క్రికెట్ కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.