హిందువుల మధ్య పాక్ బ్యాట్స్ మన్ నమాజ్ చేయడం నచ్చిందన్న దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్.. విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు

27-10-2021 Wed 14:25
  • వకార్ మాటలపై వెంకటేశ్ ప్రసాద్, హర్షా భోగ్లే విమర్శలు
  • క్షణికావేశంలో అన్నానన్న వకార్
  • ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని కామెంట్
Pakistan Waqar Younis Apologizes For His Comments
పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ క్షమాపణలు కోరాడు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్–పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. అయితే, దానిపై స్పందించిన వకార్.. అంత మంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం తనకు బాగా నచ్చిందని వ్యాఖ్యానించాడు. అది తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు.

అయితే, ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు టీమిండియా మాజీలు మండిపడ్డారు. వారి మాటల్లోని జిహాదీ తత్వం బయటపడిందని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. వకార్ లాంటి గొప్ప ఆటగాడి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి రావడం బాధాకరమని హర్ష భోగ్లే అన్నాడు. పాకిస్థాన్ లోని మంచి క్రీడా ప్రేమికులంతా అతడి మాటల్లోని నిగూఢార్థాన్ని అర్థం చేసుకోవాలన్నాడు.

దీంతో వకార్ యూనిస్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరాడు. ఏదో క్షణికావేశంలో అన్నానే తప్ప తనలో ఏ దురాలోచనా లేదని పేర్కొన్నాడు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని తనకు లేదని చెప్పాడు. ప్రజలందరినీ ఏకం చేసేది కేవలం క్రీడలేనని, మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదని స్పష్టం చేశాడు.