పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత.. సోనార్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు రోజుల పాటు లాక్ డౌన్

27-10-2021 Wed 14:07
  • పెరుగుతున్న కరోనా కేసులు
  • 19 కంటెయిన్ మెంట్ జోన్ల ఏర్పాటు
  • మమత సర్కార్ కు ఐసీఎంఆర్ లేఖ
Bengal Town Goes Into 3 Day Lockdown
దేశంలో మళ్లీ లాక్ డౌన్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరణాలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 13,451 కేసులు నమోదు కాగా.. 585 మంది చనిపోయారు. మరణాల రేటు దాదాపు 5 శాతంగా నమోదైంది. అయితే, బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

24 పరగణాల జిల్లాలోని సోనార్ పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. మూడు రోజుల పాటు అన్నింటినీ బంద్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అత్యవసర సేవలు తప్ప అన్నింటిపైనా ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధాని కోల్ కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే సోనార్ పూర్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా సోనార్ పూర్ లో 19 కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

మరోవైపు దుర్గా పూజ పండుగల తర్వాత కరోనా కేసులు పెరగడంతో బెంగాల్ ప్రభుత్వానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) లేఖ రాసింది. దుర్గా పూజ పండుగ నుంచి ఇప్పటిదాకా కరోనా కేసులు 25 శాతం పెరిగాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న ఒక్క కోల్ కతాలోనే 248 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయని గుర్తు చేసింది. అయితే, కొత్త కేసుల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారు.