షమీకి అండగా బీసీసీఐ.. మూడు ముక్కల్లో విమర్శకులకు సమాధానం

27-10-2021 Wed 13:35
  • ప్రౌడ్ ఇండియన్ అంటూ కామెంట్
  • శక్తిశాలి అని ప్రశంస
  • పాక్ పై ఓటమి పట్ల షమీపై నెటిజన్ల విమర్శలు
  • తాజాగా స్పందించిన బీసీసీఐ
BCCI Responds To Trolls On Shami
పాక్ తో భారత్ మ్యాచ్ ఓడిపోగానే చాలా మంది మహ్మద్ షమీపైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మాటల తీవ్రతనూ పెంచారు. పాకిస్థాన్ కు వెళ్లిపోవాలంటూ ట్రోల్ చేశారు. ఎంత తీసుకున్నావ్.. ఎంతకు అమ్ముడుపోయావ్? అంటూ షమీని ఘోరంగా అవమానించారు.

దీనిపై సచిన్, సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు మాజీలు స్పందించారు. షమీకి మద్దతుగా నిలిచారు. షమీ ఓ గొప్ప బౌలర్ అని, టీమిండియా క్యాప్ పెట్టుకున్నవారంతా దేశభక్తులేనని అన్నారు. అయితే, ఈ వ్యవహారంపై బీసీసీఐగానీ, కోహ్లీగానీ స్పందించకపోవడంతో నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) స్పందించింది. మూడు ముక్కలు, ఒక్క ఫొటోతో షమీని విమర్శిస్తున్న వారి నోళ్లను మూయించింది. ‘‘గర్వించే ఇండియన్.. శక్తిశాలి.. మునుముందుకు..పైపైకి’’ అంటూ ట్వీట్ చేసింది. దానికి షమీతో కోహ్లీ ఉన్న ఫొటోను జత చేసింది.