కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలింది: బండి సంజయ్

27-10-2021 Wed 11:35
  • టీఆర్ఎస్ పార్టీ డబ్బునే నమ్ముకుంది
  • హుజూరాబాద్ లో ముఖం చెల్లకే ఈసీపై కేసీఆర్ నిందలు వేస్తున్నారు
  • టీఆర్ఎస్ తాను తీసుకున్న గోతిలో తానే పడింది
BJP will win in Huzurabad says Bandi Sanjay
హుజూరాబాద్ ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కో ఓటర్ కు రూ. 20 వేలు పంచిందని... టీఆర్ఎస్ డబ్బు పంపిణీని ఎక్కడా అడ్డుకోవద్దని తమ పార్టీ శ్రేణులకు చెప్పామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుంటే... తాము ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు.

దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. దళితబంధుకు వ్యతిరేకంగా తాము ఫిర్యాదు చేయలేదని... అన్ని పార్టీలు దళితబంధుకు సహకరిస్తున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని అన్నారు. హుజూరాబాద్ లో ముఖం చెల్లకే ఈసీపై కేసీఆర్ నిందలు వేస్తున్నారని ఎద్దవా చేశారు.

హుజూరాబాద్ నుంచి దళితబంధుపై బీజేపీ యుద్ధం ప్రారంభించబోతోందని బండి సంజయ్ చెప్పారు. దళితులకు ఇస్తామన్న సీఎం పదవి ఏమైందని, మూడెకరాల భూమి ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేసీఆర్ చేయించుకున్న అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందనే విషయం తేలిందని చెప్పారు.