2018లో నా పోరాటయాత్ర సందర్భంగా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయిపై అనేక ఫిర్యాదులు అందాయి: పవన్ కల్యాణ్

27-10-2021 Wed 07:35
  • డ్రగ్స్ చుట్టూ ఏపీ రాజకీయాలు
  • ట్విట్టర్ లో స్పందించిన పవన్
  • నల్గొండ ఎస్పీ క్లిప్పింగ్ ను పంచుకున్న వైనం
  • దేశం మొత్తం ప్రభావితమవుతోందని విమర్శలు
Pawan Kalyan tweets on Ganja issue
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం కేంద్రబిందువుగా మారింది. డ్రగ్స్ అంశం టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించగా, ఈ అంశంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. 2018లో తాను నిర్వహించిన పోరాటయాత్ర సందర్భంగా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయికి సంబంధించి తనకు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు నాడు పోరాటయాత్ర చేపట్టానని, అయితే  ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ అంశాలతో పాటు గంజాయి దందా, గంజాయి మాఫియా పైనా ప్రజలు ఫిర్యాదు చేశారని పవన్ వివరించారు.

ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని నల్గొండ ఎస్పీ కూడా అన్నారని తెలిపారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను కూడా పవన్ కల్యాణ్ పంచుకున్నారు. ఏపీ మాదకద్రవ్యాల అడ్డాగా మారిందని, ప్రతిస్థాయిలోనూ డ్రగ్స్ కింగులతో నిండిపోయిందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన పాలకులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడంతో యావత్ దేశం ప్రభావితమవుతోందని పేర్కొన్నారు.