Anita Anand: కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ నియామకం

Indian origin Anita Anand appointed as Canada new defense minister
  • కెనడా క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ
  • రక్షణ శాఖ మంత్రిగా హర్జీత్ సజ్జన్ తొలగింపు
  • గతంలో ప్రజా సేవల మంత్రిగా పనిచేసిన అనితా ఆనంద్
  • కరోనా సమయంలో సమర్థ పనితీరుతో గుర్తింపు
కెనడా క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ ను నియమించారు. ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగారు. అయితే, సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన వైఖరి పట్ల విమర్శలు వచ్చాయి. దాంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్ కు అప్పగించారు. సజ్జన్ ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు.

54 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ ఇటీవలే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. కార్పొరేట్ లాయర్ గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
Anita Anand
Defense Minister
Canada
Indian Origin

More Telugu News