కొవాగ్జిన్ కు లభించని అనుమతి... అదనపు సమాచారం కావాలంటున్న డబ్ల్యూహెచ్ఓ

27-10-2021 Wed 06:31
  • కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • అత్యవసర వినియోగం కోసం డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు
  • వచ్చే నెల 3న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం భేటీ
  • కొవాగ్జిన్ పై తుది నిర్ణయం తీసుకోనున్న కమిటీ
WHO seeks additional info from Covaxin developers for final assessment
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతులు లభించడంలో జాప్యం జరుగుతోంది. కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం భారత్ బయోటెక్ ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి. నవంబరు 3న సమావేశం కానున్న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం కొవాగ్జిన్ పై తుది నిర్ణయం తీసుకోనుంది.

అత్యవసర వినియోగ జాబితాలో తమ వ్యాక్సిన్ ను కూడా చేర్చాలంటూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ఏప్రిల్ 19న డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు చేసుకుంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతులు లభిస్తే కొవాగ్జిన్ ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగించే వీలుంటుంది. అదే సమయంలో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు పలు దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లవచ్చు.