దయచేసి నా పెళ్లికి నన్ను కూడా పిలవండి... ఇంతకీ పెళ్లి ఎక్కడ?: పుకార్లపై సెటైర్ వేసిన మంచు మనోజ్

26-10-2021 Tue 22:04
  • ప్రణతి రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి, విడాకులు
  • అప్పటినుంచి మనోజ్ పై కథనాలు
  • తాజాగా ఓ వెబ్ సైట్లో కథనం
  • మీ ఇష్టం రా, అంతా మీ ఇష్టం! అంటూ మనోజ్ వ్యంగ్యం
Manchu Manoj satires on a website story
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ రావడం సాధారణ విషయంలా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఈ ధోరణులు ఎక్కువయ్యాయి. యువ నటుడు మంచు మనోజ్ వైవాహిక జీవితం విచ్ఛిన్నం కాగా, ఆ తర్వాత ఆయనపై అనేక విధాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మంచు మనోజ్ ఓ విదేశీ వనితతో ప్రేమలో ఉన్నాడంటూ ఓ వెబ్ సైట్లో కథనం వచ్చింది. అయితే మోహన్ బాబు మాత్రం తమ బంధువుల అమ్మాయినే మనోజ్ చేసుకోవాలని పట్టుబడుతున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఈ వెబ్ సైట్ కథనంపై మంచు మనోజ్ సెటైర్లు వేశారు. 'దయచేసి నా పెళ్లికి నన్ను కూడా పిలవండి' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 'ఇంతకీ పెళ్లెక్కడ? ఎవరా బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల? మీ ఇష్టం రా, అంతా మీ ఇష్టం' అంటూ బ్రహ్మానందం పిక్ తో ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. అంతేకాదు, ఆ వెబ్ సైట్లో వచ్చిన కథనం లింకును కూడా మంచు మనోజ్ పంచుకున్నారు.