726 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చిరంజీవిని కలిసిన దివ్యాంగ అభిమాని

26-10-2021 Tue 21:12
  • 'మాస్టర్' సినిమా రిలీజై పాతికేళ్లు
  • అమలాపురం నుంచి పాదయాత్ర
  • చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్దకు చేరుకున్న యువకుడు
  • చలించిపోయిన చిరంజీవి
Fan met Chiranjeevi after walk hundreds of kilometres
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయితేనేం, తన ఆరాధ్య హీరో కోసం ఆ యువకుడు సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో 23 రోజుల్లో 726 కిమీ నడిచాడు.

గంగాధర్ పాదయాత్ర గురించి విన్న చిరంజీవి ఆ దివ్యాంగుడి అభిమానానికి కదిలిపోయారు. వెంటనే అతడ్ని తన నివాసానికి ఆహ్వానించారు. తనపై అభిమానాన్ని అతడి మాటల్లో విన్న చిరంజీవి ముగ్ధుడయ్యారు. అయితే, ఆ దివ్యాంగుడు తనకోసం వందల కిలోమీటర్లు నడిచి రావడం పట్ల ఆయన కొంచెం బాధపడ్డారు. మరోసారి ఇలాంటివి చేయవద్దని సూచించారు.

ఈ యాత్ర ఎందుకు చేశావని చిరంజీవి అడగ్గా... మాస్టర్ సినిమా రిలీజై 25 ఏళ్లయిన సందర్భంగా పాదయాత్ర చేపట్టినట్టు గంగాధర్ వివరణ ఇచ్చాడు.