చరణ్ మూవీలో పవర్ఫుల్ విలన్ గా సురేశ్ గోపీ!

26-10-2021 Tue 17:53
  • షూటింగు దశలో శంకర్ మూవీ
  • పవర్ఫుల్ గా డిజైన్ చేసిన విలన్ రోల్
  • ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
 Suresh Gopi in Shankar Movie
తెలుగులో రాజశేఖర్ మాదిరిగానే మలయాళంలో సురేశ్ గోపీ, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకి పెట్టింది పేరు. మలయాళ అనువాదాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాంటి సురేశ్ గోపీ .. చరణ్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

చరణ్ తో శంకర్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పూణేలో జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుందట. ఆ పాత్రకి సురేశ్ గోపీ అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించిన శంకర్, ఆయనను ఎంపిక చేశాడని అంటున్నారు.

తెలుగులో సురేశ్ గోపీ చేస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని అలరించనుంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.