ఐఐటీ ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు బహూకరించిన సీఎం జగన్

26-10-2021 Tue 17:48
  • ర్యాంకర్లతో సీఎం భేటీ
  • మరింత కష్టపడి చదవాలని సూచన
  • ఐఏఎస్ స్థాయికి చేరుకోవాలని పిలుపు
  • కష్టపడితే సాధ్యంకానిది ఏదీ లేదని హితవు  
CM Jagan presents laptops to SC and ST IIT rankers
ఐఐటీ తదితర జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐఐటీ, ఇతర ర్యాంకర్లతో సీఎం జగన్ ఇవాళ భేటీ అయ్యారు. వారికి ల్యాప్ టాప్ లు బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వారు ఉన్నతస్థాయికి ఎదిగే క్రమంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందుతాయని హామీ ఇచ్చారు.

ఐఏఎస్ లక్ష్యంగా కృషి చేయాలని, కలెక్టర్లు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించి, నేడు సీఎంవో అధికారి స్థాయికి ఎదిగిన రేవు ముత్యాలరాజు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇవాళ ఐఏఎస్ లుగా ఉన్నతస్థానాల్లో ఉన్న పలువురు సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని సీఎం జగన్ వివరించారు. అసాధ్యమన్నది ఏదీ లేదని, శ్రమను నమ్ముకోవాలని పేర్కొన్నారు.