టీడీపీ నేతల డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు: మంత్రి కన్నబాబు

26-10-2021 Tue 15:51
  • ఢిల్లీలో టీడీపీ నేతల పర్యటన
  • ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారన్న కన్నబాబు
  • ఉనికిని చాటుకునే ప్రయత్నాలు అంటూ విమర్శలు
  • చంద్రబాబుకు నిబద్ధత లేదని వ్యాఖ్యలు
Kannababu fires on TDP leaders
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఏపీలో ఆర్టికల్ 356 విధించాలని కోరడంపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందే గాక ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వీళ్ల డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసని అన్నారు. మీరు తిట్టిన తిట్లు వాళ్లకు గుర్తుండవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఏపీ వాస్తవ పరిస్థితులేంటో వాళ్లకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

"ఏపీ డ్రగ్స్ మయం అంటూ ఢిల్లీ గల్లీల్లో చెబుతున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ఇతర రాష్ట్రాలు మన గురించి ఏమనుకుంటాయి? రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల గౌరవాన్ని చంద్రబాబు తగ్గిస్తున్నారు" అంటూ కన్నబాబు విమర్శించారు. క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు ఏవీ లేని చంద్రబాబు గురించి అందరికీ తెలుసని అన్నారు.