కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్

26-10-2021 Tue 14:20
  • క్రమశిక్షణతో ఉండాలని హితవు
  • ఐకమత్యంతో పోరాడాలని ఆదేశం
  • వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీనే ముఖ్యం
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నేతలతో సమావేశం
Congress Chief Warns Party Leaders Say Lack Of Clarity
కాంగ్రెస్ నేతలకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలు గొడవపడడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అందరూ క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగత లక్ష్యాలు, స్వార్థ ప్రయోజనాలను దూరం పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ ఉన్నత స్థాయి నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దుష్ట చర్యలపై బాధితుల తరఫున పోరాటాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లోని నేతల మధ్య సహకారం కొరవడిందని, వారిమధ్య వారికే స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలపై పోరాటంలో నేతలకు స్పష్టత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

నేతలందరూ ఐకమత్యంతో మెలగాలని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని తేల్చి చెప్పారు. పార్టీ మెరుగైన స్థానంలో ఉన్నప్పుడే నేతలూ మంచి స్థానాల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాధాన్యపరంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణను ఇవ్వాలని నేతలకు సోనియా సూచించారు. అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా పార్టీ నూతన సభ్యత్వ నమోదుపై తీసుకోవాల్సిన చర్యలపైనా వారు చర్చించారు. ఈ డ్రైవ్ వచ్చే నెల ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 దాకా జరగనుంది.