ఈ ఊరు కేసీఆర్ కు, నాకు అన్నం పెట్టింది: హరీశ్ రావు

26-10-2021 Tue 13:50
  • సింగాపురం గ్రామంలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం
  • సింగాపురం కేసీఆర్ కు, తనకు ఆతిథ్యమిచ్చిందన్న హరీశ్
  • హుజూరాబాద్ కు ఈటల చేసిందేమీ లేదని వ్యాఖ్య
Harish Rao election campaign in Singapuram village
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎల్లుండితో ప్రచారం ముగియనుంది. గత నెల రోజులుగా అన్ని పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా సింగాపురం గ్రామంలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ... ఆ గ్రామస్థులను సెంటిమెంటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ ఊరు తమకు అన్నం పెట్టిందని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తనకు కూడా ఆతిథ్యమిచ్చి ఆదరించిందని చెప్పారు. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ కు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. సింగాపురం అంటే తనకు ఎంతో ఇష్టమని... ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే మరింత కష్టపడి పని చేస్తామని, మీ రుణం తీర్చుకుంటామని అన్నారు.

బీజేపీ నేతలు చెప్పే మాటలను నమ్మొద్దని గ్రామస్థులను హరీశ్ కోరారు. ధరలు పెంచిన బీజేపీ మనకెందుకని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని అన్నారు. దళితబంధు పథకాన్ని అమలు చేయకపోతే తన పేరును మార్చుకుంటానని చెప్పారు.