COVID19: కరోనా వ్యాక్సిన్​ తీసుకోకుంటే రేషన్​, పెన్షన్​ బంద్​.. తెలంగాణ సర్కార్​ కీలక నిర్ణయం

Telangana Govt To Cut Ration and Pension those Who Are Not Vaccinated
  • నవంబర్ 1 నుంచే అమలు
  • వెల్లడించిన హెల్త్ డైరెక్టర్
  • డిసెంబర్ నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలన్న హైకోర్టు
  • ఇప్పటిదాకా 2.13 కోట్ల మందికి టీకాలు
  • అందులో 86 లక్షల మందికే రెండో డోసు
కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారిపట్ల కఠినంగా వ్యవహరించనుంది. వ్యాక్సిన్ వేసుకోని వారికి రేషన్, పెన్షన్ ను బంద్ చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, గతంలోనే దీనిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం మంది పెద్దలు మొదటి డోసు వేసుకున్నా.. రెండో డోసు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రెండు డోసులు వేసుకుంటేనే ప్రతిరక్షకాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలోనే వేగంగా వ్యాక్సినేషన్ ను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 2.77 కోట్ల మంది పెద్దవారుండగా.. అందులో ఇప్పటికే 2.13 కోట్ల మందికి టీకాలు వేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 86 లక్షల మందే రెండో డోసు తీసుకున్నారు. రెండో డోసు గడువు ముగిసినా 36 లక్షల మంది ఇంకా రెండో డోసు తీసుకోలేదు.
COVID19
Telangana
Corona Vaccine
Covishield
COVAXIN

More Telugu News