Cricket: పాక్ అభిమానికి షమీ సీరియస్ వార్నింగ్.. 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి వీడియో వైరల్!

  • టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఓటమి పట్ల షమీపై ట్రోలింగ్
  • అండగా నిలిచిన పలువురు మాజీలు, నెటిజన్లు
  • చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వీడియోను పోస్ట్ చేస్తున్న నెటిజన్లు
  • అప్పుడు షమీ ఒక్కడే మాట్లాడాడంటూ కామెంట్లు
Shami Serious Warning To Pak Cricket Fan

టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్, రాహుల్ లు రాణించలేదు. ప్రధాన బౌలర్లెవరూ ఒక్క వికెటూ తీయలేదు. గొప్ప బౌలర్ గా పేరున్న బుమ్రా కూడా వికెట్ పడగొట్టలేదు. కానీ, అంతా మహ్మద్ షమీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.

ఈ క్రమంలోనే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్ లోనూ భారత్ పై పాక్ గెలిచింది. టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లే క్రమంలో ఓ పాక్ అభిమాని ‘బాప్ కౌన్ హై.. బాప్ కౌన్ హై’ అంటూ దూషించాడు.

కోహ్లీ, రోహిత్, ధోనీ సహా జట్టు సభ్యులంతా మౌనంగా వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్లాక షమీ వెనక్కొచ్చి దూషించిన పాక్ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాటి కెప్టెన్ ధోనీ వెంటనే అతడిని వారించాడు. డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ వీడియోను పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. నాడు షమీ ఒక్కడే మాట్లాడాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News