Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ.. కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందో చెప్పిన ఏసీపీ సురేందర్

Shadnagar ACP Surender attend to sirpurkar commission Inquiry
  • ఎన్‌కౌంటర్ తర్వాత నా మానసిక స్థితి బాగోలేదు
  • అందుకే వివరాలు సరిగా నమోదు చేయలేకపోయా
  • మా బృందంలోని లాల్‌మదార్ ముందుగా కాల్పులు జరిపారు
  • మా వెంట ఉన్న సాక్షులను రక్షించాల్సిన బాధ్యత కూడా మాపైనే ఉంది
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరైన షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పలు కీలక విషయాలను వెల్లడించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు నిందితులు తమ ఆయుధాలు లాక్కుని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరిపారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.

 ఈ ఘటన తర్వాత సురేందర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎన్‌కౌంటర్ కేసు నమోదు చేసినప్పటికీ ఫిర్యాదులో కానీ, ఆ తర్వాత సమర్పించిన అఫిడవిట్‌లో కానీ నిందితులు మట్టిచల్లినట్టు కానీ, కాల్పులు జరిపినట్టు కానీ ఎక్కడా పేర్కోలేదు. ఇదే విషయాన్ని కమిషన్ ప్రశ్నించింది.

దీనికి సమాధానంగా ఏసీపీ సురేందర్ మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ తర్వాత తన మానసిక స్థితి బాగోలేదని, అందుకనే వివరాలను సరిగా నమోదు చేయలేకపోయానని చెప్పారు. అలాగే, చీకటిగా ఉండడంతో ముందు ఎవరు మట్టిచల్లారు? ఎవరి కళ్లలో మట్టి పడిందన్న విషయాలను గమనించలేకపోయానని వివరించారు.

 అయితే, నిందితులను భయపెట్టేందుకే కాల్పులు జరపాలని సిబ్బందికి చెప్పానని తెలిపారు. తమ బృందంలోని లాల్‌మదార్ ముందుగా కాల్పులు జరిపారని, తమతోపాటు సాక్షులు కూడా ఉండడంతో వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందన్నారు. కాబట్టే కాల్పులకు ఆదేశించినట్టు ఏసీపీ వివరించారు.
Disha Encounter
Shadnagar
ACP Surender
Shamshabad

More Telugu News