Guntur District: గుంటూరు జిల్లాలో బాలింతతో గ్రామ వలంటీరు అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

  • ఫోన్ నంబరు కోసం వెళ్లి బాలింతతో అసభ్యంగా ప్రవర్తించిన పిల్లుట్ల వలంటీరు
  • భయంతో బయటకు పరుగులు తీసిన బాధితురాలు
  • పోలీసులకు ఫోన్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న వాసిరెడ్డి పద్మ
Case against Volunteer in Guntur district who misbehave with lady

బాలింతతో అసభ్యంగా ప్రవర్తించిన గ్రామ వలంటీరుపై గుంటూరు జిల్లా మాచవరం మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పిల్లుట్లకు చెందిన వలంటీరు మల్ల గోపి ఈ నెల 22న గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి భార్యను ఫోన్ నంబరు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో భయపడిపోయిన ఆమె ఇంట్లోంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి పొరుగింట్లోకి వెళ్లింది. అక్కడి నుంచి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ మరుసటి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఆదివారం వలంటీరుపై కేసు నమోదు చేశారు.

విషయం తెలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నిన్న పోలీసు ఉన్నతాధికారులతోపాటు మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాలింతతో అసభ్యంగా ప్రవర్తించిన వలంటీరుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

అలాగే, బాలికలకు బ్లూ ఫిల్మ్స్ చూపించిన సత్తెనపల్లి ఊర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు, గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్‌లో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం ఘటన, చిత్తూరు జిల్లా పీలేరులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపుల ఘటన, ఉద్యోగినులను వేధించిన ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో పద్మ మాట్లాడారు.

More Telugu News