ఆనందయ్య మందుపై హైకోర్టులో వాదోపవాదాలు

25-10-2021 Mon 15:28
  • కంటి చుక్కల మందు తయారుచేసిన ఆనందయ్య
  • ప్రభుత్వ అనుమతికోసం దరఖాస్తు
  • కోర్టులో రిట్ పిటిషన్
  • ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలన్న న్యాయస్థానం
High Court hears Anandaiah Eye Drops
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య మందు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాగా, ఆనందయ్య కంటి చుక్కల మందుకు అనుమతుల అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరానని ఆనందయ్య తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తన పిటిషన్ లో వివరించారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి.

అయితే, అసలు, ఆనందయ్య ప్రభుత్వానికి ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ఆనందయ్య న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును, అందుకు ప్రభుత్వం వెలిబుచ్చిన స్పందనను కోర్టుకు సమర్పించారు.

అనంతరం ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు కొనసాగిస్తూ, ఆనందయ్య కంటి చుక్కల మందు ప్రమాదకరం అని వెల్లడించారు. దాంతో కోర్టు... ఆనందయ్య మందు కారణంగా ఎందరు చనిపోయారు? కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఎందరు చనిపోయారు? అంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాదు, ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని, సాంకేతిక కారణాలు అడ్డుచెప్పి దరఖాస్తును తిరస్కరించవద్దని పేర్కొంది.