Rajinikanth: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

  • ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం
  • ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ఫాల్కే అవార్డు అందుకున్న రజనీ
  • దర్శకుడు బాలచందర్, సోదరుడు సత్యనారాయణ, స్నేహితుడు రాజ్ బహదూర్ లకు అవార్డు అంకితం   
  • ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ధనుష్
Rajinikanth has taken Dada Saheb Phalke award

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం ఆయనను వరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్న రజనీకాంత్ తన స్పందన వెలిబుచ్చారు.

"గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతికి, సమాచార ప్రసారశాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కు, అతిథులకు, చలనచిత్ర పురస్కారాల విజేతలు అందరికీ శుభోదయం. ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డును నా గురువు, మార్గదర్శి కె.బాలచందర్ కు, నా సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ కు, నేను బస్ కండక్టర్ గా పనిచేసినప్పుడు డ్రైవర్ గా వ్యవహరించిన రాజ్ బహదూర్ కు అంకితం ఇస్తున్నాను.

బాలచందర్ గారికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను. నా సోదరుడి విషయానికొస్తే... తండ్రి తర్వాత తండ్రిలా గొప్ప విలువలతో నన్ను తీర్చిదిద్దాడు. నాలో ఆధ్యాత్మిక బీజాలు వేసింది నా సోదరుడే. నా మిత్రుడు రాజ్ బహదూర్ గురించి చెప్పాలంటే... నాలో నటుడ్ని అందరికంటే ముందు గుర్తించి ప్రోత్సహించింది అతడే. అంతేకాదు, నా దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, సహనటులు, డిస్ట్రిబ్యూటర్లు, వివిధ రకాల మీడియా... ఇలా నా ఎదుగుదలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ వినమ్రంగా పేర్కొన్నారు.

కాగా, ఇదే వేదికపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం విశేషం. అసురన్ చిత్రంలో నటనకు గాను ధనుష్ ను నేషనల్ అవార్డు వరించింది.

  • Loading...

More Telugu News