రాష్ట్రపతితో సమావేశం తర్వాత జగన్ పై చంద్రబాబు ఫైర్

25-10-2021 Mon 13:34
  • గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏపీలోనే బయటపడుతున్నాయి
  • నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
  • జగన్, డీజీపీ ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి
Chandrababu fires on Jagan after meeting with President Ram Nath Kovind
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని అన్నారు. గుజారాత్ లోని ముంద్రా ఎయిర్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని... దీనిపై విచారణ జరిపితే చివరకు విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చిందని మండిపడ్డారు.

ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయనే విషయం కూడా బయటపడిందని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రపతికి అన్ని విషయాలను వివరించామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లు ఏపీకి వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని తయారు చేయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉన్న ఏపీ... ఇప్పుడు డ్రగ్స్ లో నెంబర్ వన్ గా ఉందని చెప్పారు.

ఒక పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు పార్టీ కార్యాలయాలు, తమ నేత పట్టాభి నివాసంపై దాడులు చేశారని అన్నారు. ఇది సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగిందని దుయ్యబట్టారు. డీజీపీ కార్యాలయం, సీఎం నివాసం సమీపంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. వైసీపీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు.