'హీరో' నుంచి 'అచ్చతెలుగందమే .. ' లిరికల్ సాంగ్!

25-10-2021 Mon 10:53
  • 'హీరో'గా మొదటి సినిమా 
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా గిబ్రాన్
  • వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు
Hero Lyrical song released
మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా 'హీరో' సినిమా రూపొందింది. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. అమరరాజా మీడియా బ్యానర్ పై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు . "నింగిలో తారక నేలపై వాలినే, కన్నులా పండగై కాలమే ఆగెనే .. అచ్చ తెలుగందమే" అంటూ ఈ పాట సాగుతోంది. నాయకా నాయికల మధ్య ప్రేమ భావనకి సంబంధించిన సన్నివేశాలపై ఈ సాంగ్ ను కట్ చేశారు.

గిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. మెలోడీ ఛాయలలో సాగిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలానే ఉంది. హీరోగా తొలి సినిమానే 'హీరో' టైటిల్ తో సినిమా చేస్తున్న ఈ కుర్రహీరోకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.