Guntur District: తరగతి గదిలోనే బాలికలకు నీలి చిత్రాలు చూపిస్తూ వేధింపులు.. సత్తెనపల్లిలో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు

  • నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన
  • న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు
  • సస్పెండ్ చేస్తామన్న డీఈవో
sattenapalli teacher showing blue films to girl students

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే నీచంగా ప్రవర్తించాడు. బాలికలకు నీలి చిత్రాలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న ఆందోళనకు దిగారు.

వివరాలలోకి వెళితే, సత్తెనపల్లి 17వ వార్డులోని శాలివాహన నగర్‌లో ఎంపీపీఎస్ (ఉర్దూ) పాఠశాల నడుస్తోంది. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక తనకు తలనొప్పిగా ఉందని రాత్రి తన తల్లితో చెప్పింది. దీంతో ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది.

ఉపాధ్యాయుడు హుస్సేన్ బూతు చిత్రాలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఏడ్చేసింది. దీంతో ఆమె ఆరా తీయగా మరికొందరు బాలికలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బాలికల తల్లిదండ్రులు వెంటనే నిందితుడైన ఉపాధ్యాయుడు హుస్సేన్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు.

దీంతో వారందరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. హుస్సేన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. పోలీసుల హామీతో ఆ తర్వాత వారు ఆందోళన విరమించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఈవో గంగాభవాని స్పందించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని వాట్సాప్‌లో పంపిస్తే సస్పెన్షన్ ఉత్తర్వులు పంపిస్తానని ఎంఈవోను ఆదేశించారు.

More Telugu News