Amaravati: నవంబరు 1 నుంచి తిరుపతికి మహాపాదయాత్ర.. ప్రణాళిక సిద్ధం చేసిన అమరావతి రైతులు

  • 45 రోజలపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం
  • విధివిధానాల ఖరారు కోసం అమరావతి జేఏసీ నాయకుల సమావేశం
  • నవంబరు 1న ప్రారంభమై డిసెంబరు 17న ముగియనున్న యాత్ర
  • ఆ రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభ
Amaravati JAC decided for maha Padayatra from november 1st

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపును నిరసిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న వెలగపూడిలో అమరావతి జేఏసీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

చేపట్టబోయే మహాపాదయాత్ర విధి, విధానాలు, నిర్వహణ కమిటీల ఏర్పాటు సహా పలు విషయాలపై చర్చించారు. తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మొత్తం 45 రోజులపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అంటే నవంబరు 1న మొదలై డిసెంబరు 17న ముగుస్తుంది. ఆ రోజు నాటికి ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

మరోవైపు, రాజధానికి రైతులు ఇచ్చిన భూములకు ప్రభుత్వం వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ, దళిత, యువజన జేఏసీ నాయకులు రాయపూడి సీడ్‌యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

More Telugu News