ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూత

25-10-2021 Mon 07:06
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు
  • 62 సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు
  • అమ్మ టీవీ సీరియల్‌కు నంది అవార్డు
tollywood character artist raja babu died
టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు.

1995లో ‘ఊరికి మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన రాజబాబు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ. స్రవంతి వంటి బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు కూడా అందుకున్నారు.