Revanth Reddy: వేషం మార్చినంత మాత్రాన ఈటల ఉత్తముడు కాలేడు: రేవంత్ రెడ్డి

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో రేవంత్ ప్రచారం
  • ఇల్లంతకుంటలో ప్రసంగం
  • కేసీఆర్, ఈటల ఎందుకు విడిపోయారో చెప్పిన వైనం
  • ఇద్దరూ దొంగలేనని వెల్లడి
Revanth Reddy slams Eatala and KCR ahead of Huzurabad by polls

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శల్లో పదును పెంచారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని వెల్లడించారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు దారితీసిందని వివరించారు. వీళ్లది దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్న పంచాయితీ, దళితుల భూములు లాక్కున్న పంచాయితీ అంటూ నిప్పులు కురిపించారు. దొంగ సొమ్ములో వాటాలు కుదరక జుట్లు పట్టుకుని కొట్టుకుని నేడు ఉప ఎన్నిక తీసుకువచ్చారని అన్నారు. వేషం మార్చి బీజేపీ తరఫున పోటీచేస్తున్నంత మాత్రాన ఈటల ఉత్తముడు కాదని అన్నారు.

"వీళ్లిద్దరూ దేనికి కొట్లాడారు? పేదల పెన్షన్ కోసం కొట్లాడారా? రైతులకు గిట్టుబాటు ధర కోసం కొట్లాడారా? చదువుకున్న యువతకు ఉద్యోగాల కోసం కొట్లాడారా? రైతు రుణ మాఫీ కోసం కొట్లాడారా? డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కొట్లాడారా?" అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.

కేసీఆర్ తాను ప్రతి మహిళ పెద్దకొడుకునని చెప్పుకుంటున్నాడని, కేసీఆర్ పెద్దకొడుకు కాదని దొంగ కొడుకు అని మండిపడ్డారు. మన కన్న కొడుకులకు నౌకరీ ఇస్తే ఇవాళ ఇలా అడుక్కుతినే పరిస్థితి వచ్చేదా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. రేవంత్ రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి తరఫున ప్రచారం చేస్తూ ఇల్లంతకుంటలో ప్రసంగించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News